సుప్రీంకు వెళ్లే వరకు తీర్పును నిలిపేయండి.. హైకోర్టులో వనమా పిటిషన్
X
కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆయనపై న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని ఆ పిటిషన్లో వనమా కోరారు. ఈ పిటిషన్పై విచార జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
2018 ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. వనమా వెంకటేశ్వరరావుపై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని, డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణిస్తూ హైకోర్టు డిక్లేర్ చేసింది.
గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా వనమా గెలవగా.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. అయితే వనమా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారంటూ గతంలో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్నేళ్లుగా వెంకట్రావు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా నిన్న తుది తీర్పు వెల్లడించింది. ఇక ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించనున్నారు.