Kothakota Srinivas Reddy : చట్టాన్ని గౌరవిస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్.. లేదంటే.. : సీపీ శ్రీనివాస్ రెడ్డి
X
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో సీపీగా బాధ్యతలు తీసుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం.. మీడియాతో మాట్లాడిన నూతన సీపీ .. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారికి హైదరాబాద్ లో చోటు లేదని , వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్స్, రెస్టారెంట్లు, ఫాంహౌస్ ఓనర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. డ్రగ్స్ ను వినియోగించినా.. ప్రోత్సహించినా జైలు శిక్ష తప్పదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని చెప్పారని, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
చట్టాలను గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ , చట్టాన్ని ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటామన్నారు సీపీ. సినీ రంగంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని.. డ్రగ్స్ వినియోగం లేకుండా సినిమా పెద్దలు చూడాలన్నారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ మూలాలు ఉంటే సహించేది లేదన్నారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు సినిమా పెద్దలతో సమావేశమవుతున్నారు. ఉద్దేశపూర్వక నేరాలు చేసేవారితో చాలా కరకుగా ఉంటామని హెచ్చరించారు సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి.