Supreme Court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
X
యూపీలోని మథుర శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. షాహీ ఈద్గాలో సర్వేకు సుప్రీం నిరాకరించింది. సర్వేకు అంగీకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. షాహీ ఈద్గా మసీదు పరిశీలనకు కమిషనర్ ను నియమించాలని అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇవ్వగా.. కమిషనర్ ను నియమించాలన్న అలహాబాద్ హై కోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమిని కూల్చేసి ఆ ప్రాంతంలో షాహీ ఈద్గాను నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ మథుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటంతో.. వాటిని మథుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. దీనిపై గతేడాది డిసెంబరులో విచారణ జరిపిన హైకోర్టు.. న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో సర్వే నిర్వహించేందుకు, దాని పర్యవేక్షణకు గాను అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులపై ముస్లిం కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. దీనిపై హిందూ సంఘాలకు నోటీసు జారీ చేసింది.హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది