KTR : ఎమ్మెల్యే వినయ్ భాస్కర్పై సీరియస్ అయిన కేటీఆర్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం చేసిన కొన్ని తప్పిదాల వల్లే.. ఓడిపోయామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం (జనవరి 10) తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కార్యకర్తలు, నేతలతో కలిసి మాట్లాడే అవకాశం రాలేదని, అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నామని, కొన్ని తప్పిదాల వల్ల ఈసారి ఓడిపోయామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతుల్లోకి తెచ్చుకునే టైం వచ్చిందని కేటీఆర్ చెప్పారు.
రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ పార్టీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మేలా లేరని, ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ బలం, గళం ఢిల్లీలో వినపడాలంటే.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో ప్రతీ ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇచ్చిన కేటీఆర్.. వారు చెప్పిన ప్రతీ అభిప్రాయాన్ని నోట్ చేసుకున్నారు. అంతకుముందు మీటింగ్ కు ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై కేటీఆర్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్స్ కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు.