KTR : ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి..
X
కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. ఆరుగ్యారెంటీలతో కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి నోటికోచ్చిన హామీలు ఇవ్వడమేగాక.. బీఆర్ఎస్ పథకాలనే కాంగ్రెస్ ఇంకా కొనసాగిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ మీద కాంగ్రెస్ నాయకులు తలో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని గతంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని కోమటిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ గతంలో చెప్పినట్లు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ అన్ని కార్యక్రమాలపై ఆరోపణలు చేసిందన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోమటిరెడ్డి గతంలో కోర్టుకు పోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా భూములు క్రమబద్దీకరిస్తామని నమ్మబలికారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ తప్పు అని ఇప్పుడు మాట మార్చుతున్నారని చెప్పారు. మార్చి 31లోపు చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని చెప్పారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసనలు, ధర్నాలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తోన్న బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.