అప్పుడు కన్పించిన రాజకీయ నేపథ్యం ఇప్పుడు కన్పించలేదా : కేటీఆర్
X
గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణలను తాము ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ రాజకీయ సంబంధాలు ఉన్నాయని తిరస్కరించారని విమర్శించారు. కానీ ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎమ్మెల్సీగా ఎలా నియమించారని ప్రశ్నించారు. అప్పుడు కనిపించిన రాజకీయ నేపథ్యం ఇప్పుడు కన్పించలేదా అని నిలదీశారు.
రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే గవర్నర్, రాజ్ భవన్ నడుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యలు కానీ.. సీఎం రేవంత్ రెడ్డికి కాదన్నారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం వేర్వేరుగా నిర్వహించారన్నారు. అదేవిధంగా సర్పంచుల పదవీకాలన్ని పొడగించాలని.. ప్రత్యేక ఇంచార్జ్లను నియమించొద్దని సూచించారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు వాళ్ల పదవీకాలం పోయిందని.. కాబట్టి ఆరు నెలల పాటు వారి పదవీకాలన్ని పొడగించాలని కోరారు.
మంచి పదవిలో ఉన్నా నీచ మానవులు తమ బుద్ధిని మార్చుకోరని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ అహంకారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉంటే ఇటువంటి విమర్శలే ఎదురవుతాయని మండిపడ్డారు. రేవంత్ బీఆర్ఎస్ ను తిట్టడం మాని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రజల తరుపున పోరాడతామని స్పష్టం చేశారు.