30 ని.లు కూర్చోరు కానీ.. 30 రోజులు కావాలా?.. ప్రతిపక్షాలపై KTR ఫైర్
X
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శాసన సభల నిర్వహనకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యఖ్యలపై ఆయన మండిపడ్డారు. శాసన సభలో 30 నిమిషాలు కూడా కూర్చునే ఓపికలేని ప్రతిపక్షాలు 30 రోజులు సభను నిర్వహించాలనడం విడ్డూరంగా ఉందంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
" అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గురువారం బీఏసీ మీటింగ్ జరిగింది. సభను 30 రోజుల పాటు కొనసాగించాలని ఓ బీజేపీ నేత లేఖ రాశాడు. కాంగ్రెస్ నేతలేమో సభను 20 రోజులు నిర్వహించాలని ఓ వైపు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో వీరుమాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మేమందరం ఉన్నాం.. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి మాత్రం ఒకరి చొప్పున సభలో ఉన్నారు. ఇది చూస్తుంటే ప్రజల మీద వీరికున్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల మీద వీరుకున్న ప్రేమ, అభిమానం ఎంతో తెలుస్తుంది. బయటనేమో 20 రోజులు కావాలి, 30 రోజులు కావాలని డైలాగులు వేస్తారు. కానీ సభలో 30 నిమిషాలు కూడా ఓపికగా కూర్చోరు. ప్రజలంతా వీరిని ఎప్పటికీ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలే వీరి సంగతి చూసుకుంరు" అని కేటీఆర్ తెలిపారు.