పరిపాలనపై ఫోకస్ పెట్టి.. పార్టీని పట్టించుకోలేదు.. ఇకపై : కేటీఆర్
X
కారు షెడ్డుకు వెళ్లలేదని.. సర్వీసింగ్కు మాత్రమే వెళ్ళిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని..దానికి పూర్తి బాద్యత తనదేనన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపునివ్వలేకపోయామని.. దీనికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని స్పష్టం చేశారు. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. నియోజవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్నారు.
ప్రభుత్వానికి - పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా.. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్దిదారునికే చేరడం వల్ల ఓటరుకు కార్యకర్తకు లింకు తెగిందని కేటీఆర్ అన్నారు. దళిత బంధు కొందరికే అందడంతో మిగతావారు అసహనంతో పార్టీకి వ్యతిరేకమయ్యారని చెప్పారు. సామాన్య రైతులు కూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం ఒప్పుకోలేదన్నారు. ప్రజలు తప్పు చేశారని అనడం కరెక్ట్ కాదని.. పార్టీ నాయకులు ఇకపై అలా అనొద్దని సూచించారు. రెండు సార్లు తమకు అధికారం ఇచ్చింది కూడా ఆ ప్రజలేనని చెప్పారు. 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేక పోయామని చెప్పారు.