Home > తెలంగాణ > పట్టాలు మాత్రమే కాదు.. రైతుబంధు, రైతు బీమా కూడా.. మంత్రి కేటీఆర్

పట్టాలు మాత్రమే కాదు.. రైతుబంధు, రైతు బీమా కూడా.. మంత్రి కేటీఆర్

పట్టాలు మాత్రమే కాదు.. రైతుబంధు, రైతు బీమా కూడా.. మంత్రి కేటీఆర్
X

పోడు భూములకు పట్టాలు మాత్రమే కాదని.. రైతుబంధు, రైతు బీమా కూడా అందుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబాబాద్‌లో రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ... ‘‘రేపట్నుంచి పోడు భూముల రైతులకు రైతుబంధు వస్తుంది. ప్రమాదం జరిగి రైతు చనిపోతే రైతు బీమా వస్తుంది" అని అన్నారు.

శుక్రవారం​ మహబూబాబాద్​ పట్టణంలో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ముందుగా మానుకోటలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటిడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను.., 200 డబుల్​ బెడ్​ రూం ఇళ్లను ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్​ పాల్గొని మాట్లాడారు. పోడు భూమి పట్టాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.06లక్షల ఎకరాల ద్వారా 1.51లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. గిరిజన రైతులందరికి రైతు బంధు, బీమా అందనుందని వివరించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు కేటీఆర్. ములుగులో 360ఎకరాల భూమిని ఇచ్చినా.. గిరిజన వర్సిటీ ఏమైందని ప్రధానిని ప్రశ్నించారు. దీనికి ప్రధాని మోదీ వరంగల్‌ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు కర్మాగారం ఇస్తామని మాట తప్పినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని కోరారు.

ఇక మంత్రి పర్యటన దృష్ట్యా మహబూబాబాద్​ పట్టణం గులాబీ వర్ణంగా మారింది. ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు పోటా పోటీగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభ జరిగే ప్రదేశంలో పార్కింగ్​ స్థలం ఏర్పాటు, భారీ ఎల్​ఈడీ స్కీన్​లు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయమే మంత్రి సత్యవతి రాథోడ్ , కలెక్టర్ శశాంకలు మంత్రి ఏర్పాటలను పరిశీలించారు. మరోవైపు కేటీఆర్​ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో ట్రాఫీక్​ ఆంక్షలు విధించారు.

Updated : 30 Jun 2023 2:29 PM IST
Tags:    
Next Story
Share it
Top