KTR: చెన్నూరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తాం : కేటీఆర్
X
60 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని 10ఏళ్లలో తాము చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు దశాబ్దాల్లో చేయనివాళ్లు 6గ్యారెంటీలు అంటూ వస్తున్నారని.. ప్రజలే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రూ.500 కోట్లతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. అనంతరం చౌరాస్తాలో రోడ్ షో నిర్వహించారు. చెన్నూరు అభివృద్ధిని ప్రజలు గమనించాలన్న మంత్రి.. త్వరలో చెన్నూరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ఓవైపు తెలంగాణకు మొండి చెయ్యి చూపే బీజేపీ, మరోవైపు చెవిలో పువ్వులు పెట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే 3 గంటల కరెంటు గ్యారంటీ, సంవత్సరానికి ఒక సీఎం రావడం గ్యారంటీ, ఆకాశం నుంచి పాతాళం వరకు కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని కేటీఆర్ విమర్శించారు. గతంలో 24 గంటల కరెంట్ కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్మితే తోడేళ్లను తీసుకొచ్చి గొర్రెలమందకు కాపాలపెట్టినట్లు ఉంటదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, కష్టాలు అని బీఆర్‌ఎస్ అంటే సాగునీళ్లు, సంక్షేమం అని కేటీఆర్ చెప్పారు. రైతు బంధు కేసీఆర్ కావాలా.. రాబంధు లాంటి కాంగ్రెస్ కావాలా అని అడిగారు. ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ లేదని.. రాష్ట్రానికి రావడమే తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. మంత్రులుగా ఉన్నవాళ్లు చేయని పనులను చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ చేశారని.. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ సారి బాల్క సుమన్ను భారీ మెజర్టీతో గెలిపిస్తే కేసీఆర్ ప్రమోషన్ ఇస్తారని వ్యాఖ్యానించారు.
20లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. పామాయిల్తో లాభాలు వస్తున్నట్లు రైతులే చెప్తున్నారని అన్నారు. 70లక్షల మంది రైతులకు 73వేల కోట్ల రూపాయల రైతబంధును అందించినట్లు తెలిపారు. దసరా దీపావళి పండుగవేళ సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ భారీ బోనస్ ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. సుమారు 700 కోట్ల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్న కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నట్లు తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలో 29.68 కోట్లతో మందమర్రి పట్టణంలో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/J2fIVMxjtd
— Balka Suman (@balkasumantrs) October 1, 2023