హైదరాబాద్ ఓటర్లు అభివృద్ధికి ఓటేశారు : కేటీఆర్
X
హైదరాబాద్ ఓటర్లు తెలివితో అభివృద్ధికి ఓటేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ అబద్ధాలకు మోసపోయారని వ్యాఖ్యానించారు. అయినా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగిందన్నారు. కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీకి 1.8శాతం ఓట్లే తేడానని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కూకట్పల్లిలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ 100రోజుల్లో అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రజలు బీఆర్ఎస్కు ప్రతిపక్ష బాధ్యతలు అప్పగించారని.. దానిని సమర్ధంగా నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద నోరు పారేసుకుంటున్నారని.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తమకు నోరు ఉందని.. కానీ వంద రోజుల వరకు ఓపిక పడతామన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ గల్లీల్లో వాటర్ ట్యాంకులు కన్పిస్తున్నాయని విమర్శించారు. తమ పాలనలో నీటికి ఇబ్బందులు లేకుండా చూశామని గుర్తుచేశారు. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.