తెలంగాణ జల విధానం ప్రపంచానికే ఆదర్శం : కేటీఆర్
X
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు మహాకవి దాశరథి అంటే.. నేడు కోటిన్నర ఎకరాల మాగాణి అని సీఎం కేసీఆర్ రుజువు చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ జల విధానం దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికే ఆదర్శమన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ప్రజలు సాగు, తాగు నీటికోసం తీవ్ర కష్టాలు పడ్డారని చెప్పారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఆ పరిస్థితులు లేవన్నారు. మండుటెండల్లో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్ డేలో ఆయన పాల్గొన్నారు.
తాగునీరు ఇవ్వక సావగొట్టింది, సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే ముఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరి ఆదరిద్దాం.. ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి’’ అని కేటీఆర్ అన్నారు. సంక్రాంతికి గంగిరెద్దులొళ్లు వచ్చినట్లు ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తారని విమర్శించారు. అటువంటి నాయకులను నమ్మకుండా ప్రజల కోసం పరితపిస్తున్న కేసీఆర్కు అండగా నిలవాలని సూచించారు.
మండుటెండలొ మత్తళ్లు..
‘‘ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండల్లా నిండుగా కనిపిస్తున్నాయి. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతాయని కలలో కూడా అనుకున్నమా. ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే ప్రజాప్రతినిధులు ఊళ్లకు వెళ్లాలంటే భయపడేవారు. ఊరికి వెళ్తే బిందెలు అడ్డం పెడతారో.. ఎక్కడ బోరింగ్ అడుగుతరో.. మోటరు అడుగుతరో అని వెనుకడుగు వేసేవారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎంతో గోస ఉండేదో అందరూ గుర్తు చేసుకోవాలి. ఆ బాధ, ఆ గోస నేడు ఉన్నదా? ఒకసారి గుండెలమీద చేయివేసుకొని చెప్పాలి’’ అని కేటీఆర్ అన్నారు.
17వేల ఎకరాలకు పోడు పట్టాలు..
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని కేటీఆర్ చెప్పారు. గ్రామ పంచాయతి కూడా కాని ములుగు ఇవాళ మున్సిపాలిటీతోపాటు జిల్లా కేంద్రమైందన్నారు. ములుగు ఎమ్మెల్యే ప్రతిపక్షమైనా.. అభివృద్ధిలో మాత్రం ఎటువంటి వివక్ష చూపలేదన్నారు. ములుగు జిల్లాలోనే 17వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు అందజేస్తామని చెప్పారు. 65 కోట్లతో కలెక్టర్ కార్యాలయం, 38.50 కోట్లతో ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. 116 మంది దళితులకు రూ.2.39కోట్లు, ఎస్టీలకు రూ.1.45కోట్ల బ్యాంకు ద్వారా సబ్సిడీ అందిస్తామని చెప్పారు.