రైతులను చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ను ఓటుతో కొట్టాలి : కేటీఆర్
X
అమాయక ప్రజలను మార్పు పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని ఆరోపించారు. రైతులను చెప్పుతో కొడదామంటున్న కాంగ్రెస్ను ఓటుతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చేవేళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. గత పదేళ్లు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు తమకు ప్రతిపక్ష బాధ్యతలు అప్పగించారని.. దానిని కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారని.. కానీ ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తామన్నారని.. కానీ వాళ్లు అధికారంలో ఉన్నట్లు మర్చిపోయారేమో అని ఎద్దేవా చేశారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మీ పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ 420 హామీలిచ్చిందని.. ఆ హామీలు అమలుచేయకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నోటికొచ్చిన హామీలిచ్చి ఇరుక్కపోయిన కాంగ్రెస్.. 5ఏళ్లు అధికారంలో ఉంటుందా లేదా అనేది చూద్దామన్నారు.