కరెంటోళ్ల ఆఫీసుకు మొసలిని పట్టుకొచ్చిన రైతులు.. మొసళ్ల పండంటూ కేటీఆర్ సటైర్
X
కర్నాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నానా తిప్పలూ పడుతోంది. సమస్యను అధిగమించడానికి కరెంటు కోతలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఒకపక్క తప్పుల తడక బిల్లులతో, మరోపక్క పవర్ కట్లతో విసిగిపోతున్నామంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కరెంటో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు. కరెంటు కోతలపై ఆగ్రహంతో ఎక్కడి నుంచో ఓ మొసలిని తీసేకొచ్చి కరెంటోళ్ల ఆఫీసు ముందు పెట్టి కలకలం రేపారు.
విజయపుర జిల్లాలోని రోనిహల గ్రామానికి చెందిన రైతులు ఓ ట్రాక్టర్‌లో మొసలిని తాడుతో కట్టి తీసుకొచ్చి పవర్ స్టేషన్ దగ్గర వదిలారు. దీంతో అధికారులు ఠారెత్తిపోయారు. కరెంటును అడ్డగోలుగా తీసేస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. రాత్రిపూట కరెంటు తీసేస్తుండడంతో పాము పుట్రా కరుస్తాయని భయపడుతున్నామని చెప్పారు. అధికారులు వారి సమస్యను పరిష్కరిస్తామన హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు మొసలి తీసుకెళ్లారు. ఈ సంఘటనై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్నాటకలో ఉచిత విద్యుత్ హామీ అమల్లో కాంగ్రెస్ చేతులెత్తేసిందని, ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ మొసలి వీడియోను ట్వీట్ చేశారు.