అధికారంలోకి వస్తే పర్యటకశాఖ అడుగుతా: కేటీఆర్
X
కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాల్లో చేయలేని పనిని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసి చూపించిందని అన్నారు మంత్రి కేటీఆర్. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తనకు పర్యాటకశాఖ ఇవ్వమని సీఎం కేసీఆర్ ను అడుగుతానని చెప్పుకొచ్చారు. బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణలో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని, పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరిగిన తర్వాత అవి ఇంకా మెరుగుపడ్డాయన్నారు. వైద్య, ఆధ్యాత్మిక, క్రీడా, అటవీ పర్యటకాలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ రంగాల్లో మౌలిక వసతులు పెంపొందించడమే బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రణాళిక అని అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీకెండ్ స్పాట్లను అభివృద్ధి చేయాల్సి ఉందని.. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల వద్ద పర్యాటకుల కోసం వసతులు కల్పింస్తామని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన విద్యుత్తు కోతలు, నీటి కొరత ఉండేదని, కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సమస్యలన్నిటినీ అధిగమించిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎంతలా అభివృద్ధి చెందిందో పక్క రాష్ట్రాల వారికి అర్థమవుతుంటే.. సొంత రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు కనిపించడంలేదని చెప్పారు. 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నేతలు.. తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు.