Bhuvanagiri congress :బీఆర్ఎస్కు షాక్.. సొంతగూటికి కీలక నేత..!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీలకు జంప్ అవుతుండగా.. ఇప్పటికే వేరే పార్టీలో చేరిన వారు మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. 2 నెలల క్రితం కాంగ్రెస్ను వీడి కారెక్కిన ఓ నేత మళ్లీ హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జులైలో పార్టీ మార్పు
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముఖ్యనేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత జులైలో కాంగ్రెస్ను వీడి కారెక్కారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. ప్రస్తుతం యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల సమయంలో పార్టీ మారడంతో కాంగ్రెస్కు పెద్ద షాకే తగిలింది. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై అసంతృప్తితోనే అనిల్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి వెంకటరెడ్డి, అనిల్ కుమార్కు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఆయన అనుచరుల కారణంగానే తాను ఓడిపోయానన్నది అనిల్ ఆరోపణ. ఇక 2019లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత విబేధాలు తారాస్థాయికి చేరాయి.
జగదీశ్ రెడ్డి మధ్యవర్తిత్వం
మంత్రి జగదీశ్ రెడ్డికి అనిల్ సమీప బంధువు. వెంకట్ రెడ్డితో విబేధాలతో ఇబ్బంది పడుతున్న అనిల్ ను బీఆర్ఎస్లోకి తీసుకెళ్లేందుకు జగదీశ్ రెడ్డి చాలా రోజులుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఆశించిన అనిల్కు అది దక్కే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్లోనే కొనసాగారు. ఒకవైపు వెంకట్ రెడ్డితో విబేధాలు మరోవైపు భట్టి విక్రమార్క పాదయాత్రలో మైక్ ఇవ్వకుండా అవమానించడంతో అనిల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు భువనగిరి అసెంబ్లీ టికెట్ను బీసీ నేతకు ఇవ్వాలని నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు తీర్మానం చేయడంతో అనిల్ కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
మళ్లీ సొంత గూటికి
బీఆర్ఎస్లో చేరిన అనంతరం అనిల్కు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. పార్టీలో ప్రయారిటీలేకపోవడం, పదవికి సంబంధించి స్పష్టమైన హామీ లభించకపోవడంతో అనిల్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు తిరిగి టచ్ లోకి రావడంతో సొంతగూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భువనగిరి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇవ్వడంతో ఆయన త్వరలోనే కారు దిగి కాంగ్రెస్కు షేక్ హ్యాండ్ ఇవ్వనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ నడుస్తోంది.