Home > తెలంగాణ > రేపే లాల్ దర్వాజ బోనాలు..

రేపే లాల్ దర్వాజ బోనాలు..

రేపే లాల్ దర్వాజ బోనాలు..
X

లాల్ దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. పాతబస్తీలో కొలువైన సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆదివారం (జులై 16) భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.

17న ఘటాల ఊరేగింపు

జూలై 16న అమ్మవారికి బోనాల సమర్పించనుండగా.. సోమవారం జులై 17న ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరగనుంది. అదే రోజున రంగం కూడా ఉంటుంది. భవిష్యవాణి వినేందుకు, ఘటాల ఊరేగింపును చూసేందుకు వేలాది మంది జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అణువణువూ పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

10 రోజుల పాటు సాగే ఉత్సవం

నిజానికి లాల్ దర్వాజ బోనాలు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సింహవాహని అమ్మవారి 115వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. జులై 7 నుండి బోనాల ఉత్సవం ప్రారంభంకాగా.. తొలి రోజు ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం దేవి అభిషేకం, ద్వజారోహణ, శిఖరపూజ, సాయంత్రం కలశ స్థాపన జరిగింది. జులై 9న ఆదివారం సాయంత్రం షాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుండి అమ్మవారి ఘటాన్ని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. జులై 16న అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం రాత్రి ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి కళ్యాణము నిర్వహిస్తారు. జులై 17న అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.

Updated : 15 July 2023 10:04 AM IST
Tags:    
Next Story
Share it
Top