MLA Lasya Nanditha: లాస్య నందిత కేసులో.. టిప్పర్ లారీ డ్రైవర్ అరెస్ట్
X
వారం రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్ఆర్(Outer Ring Road)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె కారును ఢీకొట్టిన టిప్పర్‌ను ఇప్పటికే గుర్తించారు. తాజాగా డ్రైవర్‌ను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కారు తొలుత టిప్పర్‌ను ఢీకొట్టిందా? లేదంటే టిప్పరే కారును ఢీకొట్టిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.
లాస్య నందిత కారు ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఆగిపోయే ముందు.. మొదట టిప్పర్ లారీని ఢీ కొన్నట్లు పోలీసులు తేల్చారు. ఆ టిప్పర్ లారీని సైతం పోలీసులు గుర్తించారు. లాస్య కారు ఓఆర్ఆర్‌పైకి ఎంటరైన టైమ్‌లో సీసీ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించగా అసలు విషయం బయటికి వచ్చింది. టిప్పర్ లారీ నంబర్ ఆధారంగా ఎటువైపు వెళ్లిందని పరిశీలించిన పటాన్‌చెరు పోలీసులు కర్ణాటకలో ఉందని గుర్తించారు. లాస్య కారు.. టిప్పర్ లారీని ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కారు డ్రైవర్ ఆకాష్ చెప్పినట్లుగా సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సింది.
కాగా ఈ ప్రమాదానికి ముందు లాస్య నందిత రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డారు. తొలిసారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఆ ప్రమాదం నుంచి బయటపడిన కొన్ని రోజులకే నల్గొండలో బిఆర్ఎస్ నిర్వహించిన సభకు వెళ్లి వస్తూ గత నెల 13న మరోమారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లాస్య తరచూ అనారోగ్యం పాలవుతుండడం, రెండు రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు, బంధువుల సూచనతో ఫిబ్రవరి 22న రాత్రి సదాశివపేట మండలం ఆరూర్‌లోని మిస్కిన్‌పాషా దర్గాకు వెళ్లి పూజలు చేయించుకున్నారు. అనంతరం తెల్లవారుజామున తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.