రేవంత్ రెడ్డికి ఏపీ నేతల శుభాకాంక్షల వెల్లువ
X
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతలు, పక్క రాష్ట్ర పార్టీల అధినేతలు సైతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆశిస్తున్నా’నని ఏపీ సీఎం జగన్ చెప్పారు.
‘తెలంగాణలో అద్భుత విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, మంత్రులకు హృదయపూర్వక శుభాభినందనలు. రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా’నని పవన్ కళ్యాణ్ అన్నారు. పలువురు ముఖ్యనేతలు, సెలబ్రెటీలు కూడా రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు.