‘అన్నా ప్లీజ్ ఒక్క పాస్ ఉందా..!’ మోదీ సభ వీఐపీ పాస్‌లకు పైరవీలు
X
ప్రధాని మోదీ రాకతో వరంగల్ నగరం కాషాయ మయం అయింది. ఆర్ట్స్ కాలేజీలో జరిగే మోదీ సభకు పెద్ద ఎత్తును కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మోదీ వరంగల్ కు వస్తుండటంతో.. ప్రజల్లో ఆసక్తి నెలకొంది. హకీంపేట నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ లో బయలుదేరిన మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అయితే, ఈ సభ వీఐపీ పాస్ ల కోసం పలువురు పడరాని పాట్లు పడుతున్నారు.
సభ నేపథ్యంలో వీఐపీ గ్యాలరీలో 2వేల వీఐపీ పాస్ లను ముఖ్య నేతలకు అందించారు. రాష్ట్ర, జిల్లా నాయకులకు తలా కొన్ని అందించారు. అదే వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తుంది. మోదీని దగ్గర నుంచి చూడాలనే కుతూహలంతో.. అభిమానులు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల వద్ద పైరవీలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో కీలక శ్రేణులకు సైతం పాస్ లు అందకపోవడం గమనార్హం.
పార్టీ హోదాను అడ్డం పెట్టుకుని ఓ నాయకురాలు వారి వర్గానికి ఎక్కువ పాస్ లు అందించిందని.. మరో వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో అసహనం వ్యక్తం చేస్తూ.. జిల్లా పార్టీ నాయకత్వాన్ని తప్పుబడుతున్నారు. బీజేపీ నేతలందరికీ ఫోన్ చేసి ఒక్క పాస్ ఇప్పించండి అంటూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.