పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి
X
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వంతెన కుంగిపోయింది. శనివారం రాత్రి భారీ శబ్ధంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ మెుత్తం పొడవు 1.6 కిలోమీటర్లు కాగా..ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరిపై 2019లో మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. 1632 మీటర్ల పొడవున్న లక్ష్మీ బ్యారేజీని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నిర్మించింది . ప్రస్తుతం 14,930 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్న బ్యారేజీకి సంబంధించి అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. లైవ్ స్టోరేజీ 10 టీఎంసీఎఫ్‌టీలు మాత్రమే. శనివారం వంతెన కుంగిన సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా.. 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో ఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నిల్వ ఉంది. శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
రాత్రి సమయంలో వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.