Telngana Assembly Elections: బీజేపీకి ఝలక్.. పార్టీ వీడిన మాజీ మంత్రి
X
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల వలసలు జోరందుకుంటున్నాయి. టికెట్ దక్కని అసంతృప్తులు, ఆశావహులు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీకి ఝలక్ తగిలింది. మహబూబ్ నగర్ చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. రానున్న ఎలక్షన్స్ లో చంద్రశేఖర్ మహబూబ్ నగర్ టికెట్ ఆశించగా.. పార్టీ అధిష్టానం తనన కాదని వేరొకరికి టికెట్ కట్టబెట్టింది. దాంతో తీవ్ర భంగపాటుకు గురైన చంద్రశేఖర్.. ఆయన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజలకు మంచి చేయడం మరిచి కేవలం రాజకీయ పబ్బం గడుపు కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ వెంట నడుస్తామని మాటిచ్చారు. బీజేపీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీలో చేరి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. బీసీ ప్రధానమంత్రిగా ఉండి కూడా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయలేదని విమర్శించారు. తెలంగాణలో గెలిస్తే బీసీని సీఎం చేస్తానని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ తనకు కనీసం మర్యాద ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం చేపడతామని చెప్తూ బీజేపీ కలలు కంటుందని అన్నారు.