Home > తెలంగాణ > Kishan Reddy: లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​ల మధ్యే ప్రధాన పోటీ..

Kishan Reddy: లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​ల మధ్యే ప్రధాన పోటీ..

Kishan Reddy: లోక్​సభ ఎన్నికల్లో  బీజేపీ, కాంగ్రెస్​ల మధ్యే ప్రధాన పోటీ..
X

భవిష్యత్‌ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్​ఎస్​ కనుమరుగు కానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి జోస్యం చెప్పారు. ఇక రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల మధ్యే ఉంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికలపై రాష్ట్రంలోని సీనియర్ నేతలతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించామని కిషన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఅర్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉన్నదో తేలిపోయిందని, ఇక రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అవసరంగానీ, కేసిఆర్ అవశ్యకతగానీ లేదన్నారు.

సంక్రాంతి తర్వాత ప్రచారం

బీజేపీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో చర్చించామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎంత శాతం ఓట్లు పడ్డాయో సమీక్షించుకున్నామన్నారు. ప్రధాని మోడీ పదేండ్ల పాలనతో యువతలో విశ్వాసం గణనీయంగా పెరిగిందని, బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని, వారి మద్దతును కూడగడతామన్నారు. సంక్రాంతి తర్వాత జాతీయ స్థాయిలో ప్రచారాన్ని వేగవంతం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. జిల్లాలు, వర్గాల వారీగా సమావేశమై ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన అంశాలను సేకరిస్తామని, నూతనంగా ఓటు హక్కు పొందిన యువతను స్వయంగా వెళ్లి కలుస్తామన్నారు. బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీ అని, నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉండడం సహజమేనని, వాటిని పార్టీ అంతర్గత సమావేశాల్లో పరిష్కరించుకుంటామన్నారు. మోడీని మూడోసారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెల్చుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ధాటిని తట్టుకోలేక రాహుల్ గాంధీ కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు ప్రధాని మోదీ

సంక్రాంతి నుంచి 22వ తేదీ వరకు దేవాలయాలను పరిశుభ్ర పరిచేందుకు స్వచ్ఛ అభియాన్ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో తెలంగాణ భాగస్వామ్యం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా ప్రతి దేవాలయంలో భారీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 22న దేశమంతా రామజ్యోతులతో కళకళలాడాలని రామజన్మ భూమి ట్రస్ట్ పిలుపునిచ్చిందని, రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ సహకరించాలని కిషన్​రెడ్డి కోరారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.

Updated : 9 Jan 2024 1:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top