చిక్కుల్లో మైనంపల్లి.. విచారణకు ఈసీ ఆదేశం..
X
బీఆర్ఎస్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ కార్యకర్తతో గొడవ చినికి చినికి గాలివానగా మారి ఎన్నికల సంఘం వద్దకు చేరింది. మైనంపల్లిపై బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ అంజనీ కుమార్‌లకు ఫిర్యాదు చేశారు.
మైనంపల్లి పోలీసులను ఉసిగొలిపి తనపై తప్పుడు కేసు పెట్టిస్తున్నాడని తెలిపారు. ఫిర్యాదును పరిశీలించిన వికాస్ రాజ్.. ఈ అంశంపై విచారణ జరపాలని డీజీపీకి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మైనంపల్లి బెదింరిపు అంటూ ఇటీవల మీడియాలో వచ్చిన ఆడియోలో సాయి ప్రసాద్‌ను చంపేస్తానని ఉంది. దీంతో సాయి ప్రసాద్ మీడియా ముందుకొచ్చారు. మైనంపల్లికి దమ్ముంటే తనను చంపించాలని, చిల్లర గొడవలు మానుకోవాలని సవాల్ విసిరారు. మైనంపల్లి బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నాడని, మ ఆఫీసులో బాత్రూంలు కడిగే పోస్ట్ ఇప్పిస్తామని అన్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే టికెట్ తిరిగి దక్కించుకున్న మైనంపల్లి మెదక్ టికెట్ తన కొడుకు రోహిత్‌కు ఇవ్వాలని పట్టుబట్టి తీవ్రవ్యాఖ్యలు చేయడం తెలిసిందే. బెజవాడ కనకదుర్గను దర్శించుకోవడానికి వెళ్తున్నానని, తిరిగి వచ్చాక కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన అన్నారు. ఆయనకు టికెట్ రద్దు చేసి మరొకరికి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.