కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న మైనంపల్లి.. ముహూర్తం ఫిక్స్..!
X
బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ నెల 27లోపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు తనకు ఫోన్ చేశారని ఆయన చెప్పారు. ఇంటికి వస్తామని చెప్పగా ఆహ్వానించానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని.. తానేంటో బీఆర్ఎస్ నేతలకు చూపిస్తానని వార్నంగ్ ఇచ్చారు.
సెప్టెంబర్ 27వ తేదీ వరకు ముహూర్తాలు బాగున్నాయని.. ఆలోపు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు మైనంపల్లి ప్రకటించారు. తనకు మద్దతు తెలిపిన నాయకులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మైనంపల్లి ఆరోపించారు. వారిపై అక్రమంగా కేసులు పెట్టి హింసిస్తోందని మండిపడ్డారు.
అంతకు ముందు మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వెళ్లారు. కాంగ్రెస్ లో చేరాలని ఆయనను ఆహ్వానించారు. అయితే సర్వే రిపోర్టు ఆధారంగా రెండు సీట్లు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని మైనంపల్లి హనుమంతరావు వారిని కోరారు. దానిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు సర్వే రిపోర్టు ఆధారంగా మల్కాజ్ గిరి, మెదక్ టికెట్ ఇస్తామని స్పష్టం చేసినట్లు చెప్పారు. తన సన్నిహితుడు నక్కా ప్రభాకర్ గౌడ్ కు మేడ్చల్ అసెంబ్లీ టికెట్ అంశాన్ని సైతం మైనంపల్లి కాంగ్రెస్ నేతల దృష్టికి తెచ్చారు. బీఆర్ఎస్ మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చినప్పటికీ తన కొడుకు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన గులాబీ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు.