Mallu Ravi : కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు..మల్లు రవి
X
మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ అవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆయన మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండోరోజే ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానాది అని తెలిపారు. మరో రెండు గ్యారెంటీలను రేపు చేవెళ్లలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు.
రేవంత్ సర్కార్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నరని మండిపడ్డారు.
కోట్లాది మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తూ డబ్బులు పొదుపు చేసుకుంటున్నారని తెలిపారు. 5 లక్షల ఆరోగ్య శ్రీ భీమా 10 లక్షల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. దీనివల్ల రోగులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వైద్యం చేయించుకుంటున్నారని చెప్పారు. రేపు 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్స్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నామని ప్రకటించారు. సీఎంగా రేవంత్ రెడ్డిని ముందు ప్రకటిస్తే 30 సీట్లు రాకపోయేవని కేటీఆర్ అనడం ఆయన దూరంహకారానికి పరాకాష్ట అన్నారు. ముందుగానే రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ప్రకటిస్తే బీఆర్ఎస్ కు 3 సీట్లు కూడా రాకపోయేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ది కుటుంబ పార్టీ కాదని..ప్రజాస్వామ్య విలువలు నిండుగా ఉన్న పార్టీ అని తేల్చి చెప్పారు. కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని మల్లు రవి అన్నారు.