Mallu Ravi : అయోధ్యకు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దురదృష్టకరం: మల్లు రవి
X
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పూర్తయింది. దేశంలోని ప్రముఖులందరికీ రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపించింది. వారంతా వేడుకకు హాజరై.. బాలరాముడిని దర్శనం చేసుకుని పులకించిపోయారు. దీనిపై స్పందించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సంచలన కామెంట్స్ చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకపోవడం దురదృష్టకరమని ఆయన ఆరోపించారు. దేశానికి ప్రథమ పౌరురాలు, గిరిజన మహిళ అయిన కారణంగా ముర్మును ఆహ్వానించలేదా? అని మల్లు రవి ప్రశ్నించారు. స్వాతంత్రం రాకముందు అంటరానితనంపై, ఎస్సీ, ఎస్టీలను దేవాలయాలు రానివ్వకపోవడంపై పోరాటాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని రామమందిరానికి ఆహ్వానించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు రాష్ట్రపతికి ఆహ్వానం అందకపోవడం అవమానకరమని ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని, రాముడు అందరి వాడని, ఆయన రాజ్యంలో అందరూ సమానులేనని మల్లు రవి తెలిపారు. రాముడు, హనుమంతుడి గుళ్లు ప్రతి గ్రామాల్లో ఉంటాయని, రాముడి చరిత్ర పిల్లాడిని అడిగినా చెప్తాడని అన్నారు. రాముడి చరిత్రను మోదీ కొత్తగా చెప్పాల్సిన పనిలేదని విమర్శించారు.