Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య
X
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భార్యను కత్తితో పొడిచి చంపిన అనంతరం ఓ భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో రాజు, సంతోషి(35) దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య సంతోషిని భర్త రాజు కిరాతకంగా హతమార్చాడు. అనంతరం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తపోవన్ కాలనీలో చెల్లెలి ఇంటికి వెళ్లాడు. ఆ భవనంలోని రెండవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. వీరి స్వస్థలం అమనగల్ సమీపంలోని ఆకుతోటపల్లి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోషి హత్య, రాజు ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని పోలీసులు వెల్లడించారు. రాజు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. మరిన్ని విషయాలు విచారణ తరవాత చెబుతామని పోలీసులు తెలిపారు.