`సెల్ఫీ ప్రయత్నం.. ఇంకా భూమి మీద నీకు నూకలు ఉన్నాయన్నా
X
సెల్ఫీ మోజులో పడి ప్రపంచాన్ని మర్చిపోతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. చుట్టు ఏం జరుగుతుంది, ఏ పరిస్థితిలో ఉన్నామో చూసుకోకుండా సెల్ఫీలకు ఎగబడుతూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా సెల్ఫీ దిగుతూ ప్రమాదాల బారిన పడిన వాళ్లు చాలామందే ఉన్నారు. అచ్చం అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. అతనికి భూమిపై ఇంకా నూకలు రాసిపెట్టి ఉన్నాయి కాబట్టే.. బతికి బట్టగట్టాడు లేదంటే.. లిస్ట్ లో చేరేవాడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
గోపాల్ పుండ్లిక్ చవాన్ (30) అజంతా గుహలు చూడ్డానికి వెళ్లాడు. అక్కడ బౌద్ధ గుహ దేవాలయాలను చూస్తుండగా.. నది, జలపాతం అతని కంట పడింది. ఇంకేముంది.. సెల్ఫీ తీసుకుందామని రాళ్ల గుట్టలు దాటి లోయ పక్కనున్న జలపాతం దగ్గరికి చేరుకున్నాడు. అంతలోనే గోపాల్ కాలు జారి లోయలో పడిపోయాడు. మొదటి అతన్ని ఎవరూ గమనించకపోగా.. గోపాల్ ఈత కొట్టే ప్రయత్నం చేశాడు. అది గమనించి అప్రమత్తమైన సిబ్బంది అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. దాదాపు పది మంది శ్రమించి అతన్ని తాడు సాయంతో బయటికి లాగారు. లోయలో పడగానే అతను గాభరా పడి ఉంటే కొట్టుకు పోయేవాడని అధికారులు తెలిపారు.