బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ అగ్రనేత కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో నాయకులు దాగుడుమూతలు మాని అమీతుమీ తేల్చుకుంటున్నారు. నమ్ముకున్న పార్టీ కనికరించకపోతే ఎగస్పార్టీకి జైకొడుతున్నారు. పార్టీలు కూడా ‘ఆకర్ష్’ ఆపరేషన్లను జోరుగా సాగిస్తున్నాయి. గెలుపు గుర్రాలను పట్టడానికి వలలు విసురుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి అసంతృప్తులకు గాలం వేస్తున్నాయి. దశాబ్దాలుగా ఒకే పార్టీలో పనిచేస్తున్న నేతలు సైతం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీలు మారడానికే మొగ్గుచూపుతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు త్వరలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన ఆయన పార్టీలో తనకు పూచికపుల్లపాటి విలువ కూడా లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలోని సొంత సోదరులే తనపై కత్తి గట్టడంతో ఏమాత్రం ఇమడలేని స్థితిలో కారెక్కాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్‌కు ఏమిటి లాభం?
మంచిర్యాల జిల్లాలో ప్రేమ్‌సాగర్ రావుకు మంచిపట్టుంది. సీనియర్ నేతగా గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీని నడిపిస్తున్నారు. అలాంటి నాయకుడు తమవైపుకు వస్తే జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడుతుందని కేసీఆర్ ఆలోచన. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సే నడిపల్లి దివాకర్ రావుకు ఎదురుగాలి తప్పదని సర్వేలో తేలిందట. ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత, సుదీర్ఘ కాలం పదవిలో ఉండడం, వృద్ధాప్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న గులాబీ బీస్ ఈసారి అభ్యర్థిని మార్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ్‌సాగర్ రావును పార్టీలో చేరుకుని మంచిర్యాల నుంచి బరిలోకి దింపాలన్నది బీఆర్ఎస్ ఆలోచన అంటున్నారు. అయితే ప్రేమ్‌సాగర్‌ను చేర్చుకోవడం మంత్రి కేటీఆర్‌కు ఇష్టం లేదని టాక్. ప్రేమ్‌సాగర్‌కు అహం ఎక్కువని, ఎవరి మాటా వినని ఆయన తమకు ఎంతవరకు విశ్వసనీయగా ఉంటారని చిన్న బాస్ అనుమానం. అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టాలంటే ప్రేమ్ సాగర్ లాంటి నాయకులకు చేర్చుకోక తప్పదు కనుక ఆహ్వానం పలకక తప్పని పరిస్థితి నెలకొంది. త్వరలో నల్గొండలో జరగనున్న రాహుల్ గాంధీ సభ నాటికి కీలక కాంగ్రెస్ నేతలను తమవైపు లాక్కుని ఆ పార్టీ గ్రాఫ్‌ను పాతాళానికి తొక్కాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. నిజానికి ప్రేమ్‌సాగర్ రావు 2018లోనే గులాబీ గూటికి చేరే ప్రయత్నం చేసినా ఆయన విశ్వసనీయతపై నమ్మకం లేకనే చేర్చుకోలేదని చెబుతున్నారు. ప్రేమ్‌సాగర్ పార్టీలోకి వస్తే తనకు సన్నిహితుడైన బాల్క సుమన్‌కు సమస్యగా మారతారని కేటీఆర్ సంశయిస్తున్నారు. ఏదేమైనా ముందు కండువా కప్పి, తర్వాత దారిలో పెట్టుకోవచ్చన్నది అధినేత ఆలోచన.
కాంగ్రెలో లొల్లేంది?
ప్రేమ్‌సాగర్ జిల్లా కాంగ్రెస్ మొత్తం తన చేతుల్లోనే ఉండాలని పట్టుబడడంతో విభేదాలు మొదలయ్యాయి. సొంత దాయాది విశ్వప్రసాద్ రావుకు, ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆసిఫాబాద్ నుంచి తనకు సన్నిహితుడైన గణేశ్ రాథోడ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలన్నది ప్రేమ్‌సాగర్ ఆలోచన. గణేశ్ తనను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారని, ఆయనకు టికెట్ ఇప్పించడం తన బాధ్యతని ప్రేమ్‌సాగర్ భావిస్తున్నారు. అయితే జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి సోదరి సరస్వతికి టికెట్ ఇవ్వాలని విశ్వప్రసాద్ వర్గం అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేస్తోంది. రేవంత్ రెడ్డి కూడా అందుకు సుముఖంగా ఉండడంతో తన మాటకు విలువ లేకుండా పోతోందని ప్రేమ్‌సాగర్ అసంతృప్తితో రగులుతున్నారు. ఇటీవల మల్లు భట్టివిక్రమార్క యాత్ర సందర్భంగా ఇరువర్గాలు స్టేజీమీదే కొట్టుకున్నాయి. తనకు గౌరవం ఇవ్వడం లేదని ప్రేమ్‌సాగర్ వేదికమీదే కన్నేళ్లు పెట్టుకున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల భోగట్టా. అనుకూల సయమం వచ్చే వరకు వేచి ఉండాలని కేసీఆర్ అంటున్నారని, అతి త్వరలోనే చేరిక ఉండొచ్చని చెబుతున్నారు.