Home > తెలంగాణ > కాంగ్రెస్లో రచ్చలేపుతోన్న రెండో జాబితా.. రాజీనామాలకు సిద్ధమైన...

కాంగ్రెస్లో రచ్చలేపుతోన్న రెండో జాబితా.. రాజీనామాలకు సిద్ధమైన...

కాంగ్రెస్లో రచ్చలేపుతోన్న రెండో జాబితా.. రాజీనామాలకు సిద్ధమైన...
X

తెలంగాణ కాంగ్రెస్లో రెండో జాబితా కాక రేపుతోంది. 45మందితో సెకండ్ లిస్ట్ విడుదలవ్వగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. కొంతమంది తమ అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యచరణను చర్చించేందుకు సిద్ధమయ్యారు. మరికొంతమంది పార్టీకే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 100స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ ఇంకా 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. అయితే ఈ స్థానాల్లో తీవ్ర పోటీ ఉండడంతో ఆచితూచి అడుగులేస్తోంది.

మునుగోడులో ముసలం..

కాంగ్రెస్ మొదటి జాబితాలో 55, రెండో జాబితాలో 45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో పెద్దగా పోటీ లేని స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా.. రెండు జాబితాలో కీలక స్థానాలను ప్రకటించింది. ఇందులో పలు ఆసక్తికర పేర్లు తెరమీదకు వచ్చాయి. కాంగ్రెస్లో చేరిన రెండో రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ దక్కించుకోగా.. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డిలకు షాక్ తగలింది. ఈ క్రమంలో చలిమెల ఇవాళ తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

నితిన్ మామ అలక..

నిజామాబాద్ రూరల్ టికెట్ భూపతిరెడ్డికి కేటాయించడంతో హీరో నితిన్ మామ నగేష్ అలకబూనారు. లాబీయింగ్ చేసేవాళ్లకే టికెట్లు ఇస్తున్నారని.. పార్టీ కోసం కష్టపడ్డవాళ్లను పట్టించుకోవడం లేదని నగేష్ ఆరోపించారు. తాను ఎన్నికల బరిలో ఉంటే నితిన్ కూడా ప్రచారం చేస్తారని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్కు ఇవ్వడంపై పీజేఆర్ కుమారుడు విష్ణు అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ తన అనుచరులతో భేటీ అవుతున్న ఆయన.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇండిపెండెంట్ బాపూరావు..!

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని బోథ్ టికెట్ ఆశించిన బాపూరావుకు సైతం నిరాశ తప్పలేదు. ఆ టికెట్ను వెన్నెల అశోక్కు ఇవ్వడంతో బాపూరావు ఇండిపెండెంట్గా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ జడ్చర్ల, నారాయణపేట స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఇవాళ తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. అదేవిధంగా హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశించగా.. ఆ స్థానాన్ని సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ కు కేటాయించింది అధిష్టానం. పార్టీ నిర్ణయంపై ప్రవీణ్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నరసింహం రెడ్డి అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ మారే యోచనలో సుభాష్..!

ఎల్లారెడ్డి టికెట్ రాకపోవడంపై వడ్డేపల్లి సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుభాష్ టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సుభాష్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంపై దండెం రాంరెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అదేవిధంగా మహబాబాబాద్ టికెట్ను ఆశించిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కు పార్టీ షాకిచ్చింది. ఆ స్థానంలో మురళీ నాయక్ ను పార్టీ ప్రకటించడంతో బలరాం నాయక్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.




Updated : 28 Oct 2023 4:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top