Home > తెలంగాణ > Medaram Jatara:మేడారం మహాజాతర.. నేడు పగిడిద్దరాజు- సమ్మక్కల పెండ్లి

Medaram Jatara:మేడారం మహాజాతర.. నేడు పగిడిద్దరాజు- సమ్మక్కల పెండ్లి

Medaram Jatara:మేడారం మహాజాతర.. నేడు పగిడిద్దరాజు- సమ్మక్కల పెండ్లి
X

తెలంగాణ కుంభమేళా , ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతర ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా ఉత్సవాలు బుధవారంతో మొదలయ్యాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో మాఘశుద్ధ పౌర్ణమి రోజైన నేడు (బుధవారం) సారలమ్మ రాకతో మహాజాతర ప్రారంభం కానుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు బుధవారం ఒకేరోజు గద్దెల పైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. ఇప్పటికే పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయల్దేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు మేడారం చేరుకుంటారు. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మను.. వడ్డెలు(పూజారులు) అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి బయలుదేరుతారు. మేడారంలో పగిడిద్దరాజు- సమ్మక్క పెండ్లి కనులపండువగా జరుగుతుంది.

తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుస్తారు. ఇక రేపు అనగా ఫిబ్రవరి 22న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెపైకి తెస్తారు. ఈరోజున మేడారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారుతాయి. మూడో రోజు అనగా ఫిబ్రవరి 23వ తేది భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం అంటే బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకుంటారు. మరికొందరు భక్తులు మేకపోతులు, కోళ్లను బలిచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో చివరి రోజైన 24వ తేది నాడు గిరిజన దేవతలు వనప్రవేశం చేస్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ ఉత్సవాల కోసం తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తున్నారు.

ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఎక్కడిక్కడ వాహనాల రూట్లతో పాటు కార్లకు పార్కింగ్ ప్లేస్ లను కూడా ఏర్పాటు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా వందకోట్లపైగా ఖర్చు చేసి జాతర ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులు జాతర కోసం ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి 23న గవర్నర్‌‌‌‌ తమిళిసై, సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి రానున్నారు.

Updated : 21 Feb 2024 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top