Medaram Jathara : మేడారం జాతరకు రాష్ట్రపతిని ఆహ్వానించాం : మంత్రి సీతక్క
X
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనులను తెలంగాణ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రులు తనిఖీ చేశారు. ఆ తర్వాత పార్కింగ్ ప్రదేశాల నుంచి సమ్మక్క, సారలమ్మ దేవతల గద్దె వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు ప్రయాణించారు. మేడారం జాతరకు వచ్చే బస్సులు, వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు , క్యూలైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు వివరించారు. ఆ తర్వాత మంత్రులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం సీతక్క మాట్లాడుతు.. సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు జాతీయ హోదా దక్కుతుందని ఆశిస్తున్నట్లు సీతక్క ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జాతర ఉంటుందన్నారు. ఆ నాలుగు రోజులు దేవతలు గద్దెలపై కొలువై ఉంటారన్నారు. బహుశా దేశంలో ఎలాంటి టిక్కెట్ లేని దేవాలయం ఇదొక్కటే కావొచ్చు అన్నారు. కుల, మత వివక్షత లేదని.. అందరూ వన దేవతలను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. జాతర పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టినట్లు తెలిపారు. గత జాతరలో 2800 బస్సులు మాత్రమే నడిపారని.. ఈసారి 6000 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఆయా జిల్లాల భక్తులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.
Visited Medaram along with Minister Ponnam Prabhakar Anna and took blessings of Sammakka Saralamma
— Danasari Seethakka (@seethakkaMLA) February 5, 2024
We also urged all the devotees to not dump waste and follow the sign boards to maintain clean surroundings.@PonnamLoksabha @revanth_anumula @RahulGandhi #SammakkaSralammaJathara pic.twitter.com/Hmi1qmxiot