Home > తెలంగాణ > Medaram Jatara : నేడు మేడారంలో “మండమెలిగె పండుగ”

Medaram Jatara : నేడు మేడారంలో “మండమెలిగె పండుగ”

Medaram Jatara : నేడు మేడారంలో “మండమెలిగె పండుగ”
X

తెలంగాణ కుంభమేళా, మేడారం(Medaram) సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి నేడు అంకురార్పణ జరుగనుంది. గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరగగా.. బుధవారం ఉదయం మండమెలిగే (Mandamelige) పండగ నిర్వహించనున్నారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించే ఈ మండమెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభమైనట్టేనని పూజారులు భావిస్తుంటారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు జరుగుతుంది.

మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లిలోని సారలమ్మగుడి, పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయం, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి మండలు(చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకొనేవారు. దీనినే మండమెలిగే పండగగా పేర్కొంటారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పనిచేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు.

మండెమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్టేనని పూజారులు చెబుతుండగా.. ఈ పూజాకార్యక్రమాలను తిలకించేందుకు కూడా భక్తులు తరలివస్తుంటారు. మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. మేడారం సమ్మక్క-సారలమ్మ(Sammakka Saralamma ) జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగు లో పుణ్య స్నానాలు చేసేందుకు గోవిందరావు పేట మండలంలోని లక్నవరం సరస్సు నుంచి సోమవారమే నీటిని విడుదల చేశారు.




Updated : 14 Feb 2024 1:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top