మీర్పేట్ గ్యాంగ్ రేప్ నిందితులు అరెస్ట్...
X
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ మైనర్ బాలికపై అత్యాచారం కేసును రాచకొండ పోలీసులు చేధించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితడి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో మంగల్ హాట్ చెందిన ఓ రౌడీషీటర్ అబేద్ లాల్ ఉన్నాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 1211/2023 U/s 452, 324, 376-DA, 506, పోక్సో యాక్ట్ 5(g)r/w 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు రాచకొండ సీపీ చౌహన్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..హైదరాబాద్ లోని లాల్ బజార్ కు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. రెండు వారాల కిందట సోదరుడు (14)తో కలిసి మీర్ పేట లోని నందనవనం కాలనీలో సమీప బంధువైన అక్క దగ్గరకు వచ్చారు. బాధితురాలు దిల్ సుఖ్నగర్ లోని ఓ క్లాత్ స్టోర్లో పనిచేస్తోంది. బాలుడు ఫ్లెక్సీల పని చేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొందరు నిందితులు వీరి ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే వీరు గంజాయి మత్తులో ఉన్నారు. నలుగురు నిందితులు బాలిక మెడపై కత్తి పెట్టారు. బిల్డింగ్ లోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లి ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తమ్ముడితో పాటు మిగతా చిన్నారుల్ని మిగతా నిందితులు అదే గదిలో బంధించారు. నిందితుల్లో ముగ్గురు కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడినుంచి వెళ్లిపోగా, బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత బాలికను వైద్య పరీక్షల అనంతరం ఆమెను సఖి కేంద్రానికి తరలించారు. నిందితులలో ఆరుగుర్ని అరెస్ట్ చేశామని, మరో నిందితుడ్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
ఇలా దొరికారు..
అష్రఫ్, తహిసీన్, చిన్నా, మహేశ్ బాలికలపై అత్యాచారాని పాల్పడిన తర్వాత రేసుకోర్సు వెనకవైపు ఉన్న ఫైజల్, ఇమ్రాన్ వద్దకు వెళ్లి కలిశారు. వారి మొబైల్స్ తీసుకుని కొన్ని కాల్స్ చేసి అనంతరం ఆ వివరాలు డిలీట్ చేశారు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో నిందితులు ఉమ్నాబాద్ వరకు వెళ్లారు. అప్పటికే పోలీసులు అక్కడ గస్తీ కాస్తుండడంతో భయపడి వెనక్కి వచ్చేశారు. ఈ క్రమంలో నగరంలోని పలు చోట్ల నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీపీ చౌహాన్ వివరించారు. మొత్తం 12 బృందాలుగా నిందితుల కోసం వేట కొనసాగించినట్లు తెలిపారు.