అయ్యయ్యో నిండు గర్భిణికి ఎంత కష్టమొచ్చే..ఇల్లు లేక 3 రోజులుగా శవాల దిబ్బలో...
X
ఆమె ఓ మానసిక వికలాంగురాలు. అందులోనూ ఓ గర్బిణీ. ఇంటి నుండి తప్పిపోయింది. సుమారు 60 కి.మీ.లు ప్రయాణించి తెలియని ఊరుకి వచ్చి చేరుకుంది. ఉండేందుకు ఇళ్లు లేదు, తినేందుకు ఆహారం లేదు. చుట్టుపక్కన ఎవరూ తెలియదు. దీంతో ఏం చేయాలో తెలియక శ్వశానాన్నే తన నివాసంగా మార్చుకుంది. పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్లో పడి ఉన్న కుళ్లిన చెత్తను ఆహారంగా తీసుకుంటోంది. గత మూడు రోజులుగా ఈ గర్భిణి మహిళ శవాల దిబ్బలోనే ఎలాంటి భయం బెరుకూ లేకుండా ఉంటోంది. అక్కడే తింటోంది పడుకుంటోంది. స్థానికంగా ఉన్న మున్సిపల్ కార్మికుల కంట ఈ మహిళ పడటంతో నువ్వు ఎవరని అడగ్గా చిరు నవ్వుతోనే సమాధానం ఇచ్చింది. దీంతో మహిళ పరిస్థితిని వారు అర్థం చేసుకున్నారు.
మానసిక వికలాంగురాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల మహిళను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాధమిక చికిత్సలో భాగంగా ఆమెకు స్నానం చేయించారు. అనంతరం వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు. మతిస్థిమితం లేకపోవడంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు మహిళ సరిగా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో వివరాలు ఆరా తీయగా గర్భిణీ మహిళ కొమురం భీం జిల్లా కెరమెరి మండలం చిన్నుగూడ ప్రాంతానికి చెందిన రాజు భాయ్ గా గుర్తించారు. దీంతో ఆమెను షీ టీమ్ సహాయంతో స్పెషల్ వాహనంలో సొంతూరుకు సురక్షితంగా పంపించారు.