బడుల్లో మధ్యాహ్న భోజనంలో మెనూ మార్పు..ఇకపై కొత్తగా కిచిడి
X
వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. విద్యార్థులు హాలిడేస్‌ను ముగించుకుని బడులకు వెళ్లే సమయం ఆసన్నమైంది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా బుక్స్, యూనిఫాంతో పాటు వర్క్‌బుక్స్, నోట్ బుక్స్ అందిస్తామని చెప్పారు. తాజాగా సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే మధ్యాహ్న భోజనంలోనూ మార్పులు తీసుకురానుంది. ప్రతి రోజూ పప్పన్నంతో పాటు కిచిడీని కొత్తగా మెనులో పొందుపరిచారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనంలో రోజు విడిచి రోజు విద్యార్థులకు పప్పన్నం పెట్టేవారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న సర్కార్ నిర్ణయం మేరకు ఇకపై ప్రతిరోజు పప్పును భోజనంలో వడ్డిస్తారు. ఈ కొత్త విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో ఈ మెనూ అమల్లోకి రానుంది. సోమవారం నుంచి శనివారం వరకు పిల్లలకు పప్పు తప్పనిసరిగా అందించనున్నారు. సోమవారం కిచిడీ , మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, ఒక కోడిగుడ్డు, ఇక మంగళవారం అన్నంతో పాటు సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీని మెనూలో చేర్చారు. బుధవారం అన్నం , ఏదో ఒక ఆకుకూర పప్పు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, ఒక కోడిగుడ్డు ఉంటుంది. గురువారం స్పెషల్‌గా వెజిటబుల్ బిర్యానీ, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ మెనూలో ఉంటుంది. శుక్రవారం వైట్ రైస్, సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు, శనివారం అన్నం, ఆకుకూర పప్పు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ ఉండే విధంగా వారానికి సరిపడా పోషకాలు పిల్లలకు అందేలా కొత్త మెనూను సిద్ధం చేశారు సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 28,606 పాఠశాలల్లో 25లక్షలకు పైగా విద్యార్థులకు పోషకాల ఆహారం అందనుంది.