మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గుడ్‌న్యూస్..
X
మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్-కమ్ హెల్పర్లకు జీతాలు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కార్మికులకు పెంచిన జీతాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy ) వెల్లడించారు. శనివారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా... మధ్యాహ్న భోజన పథకాని (Midday meals ) కి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ఇక కార్మికులకు పెంచిన జీతాల వల్ల సంవత్సరానికి రూ.108 .40 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని తెలిపారు. ప్రాథమిక విద్యలో అభ్యసన సంక్షోభాన్ని నివారించి.. భాష, గణిత సామర్థ్యాలను పెంచేందుకు అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు సమీపించిన తరువాత తొందరపడకుండా.. ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు.