Prajavani: ప్రజాభవన్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
X
ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి ) కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఉన్నతాధికారులు స్వయంగా దరఖాస్తులను స్వీకరించి భరోసా కల్పిస్తున్నారు. ఈరోజు వివిధ జిల్లాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు ప్రజా భవన్ వద్ద నిరసనకు దిగారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు, మెస్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. పెంచిన రూ.3వేల జీతాన్ని వెంటనే ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.
కాగా, ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సమస్యల పరిష్కరణకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు. ప్రజాభవన్ వెలుపల ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్నది.