రాజకీయ లబ్ది కోసం రాష్ట్రం పరువు తీస్తున్నారు - అక్బరుద్దీన్ ఒవైసీ
X
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం సరికాదని ఎంఎంఐ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి లెక్కలతో రాష్ట్రాలకు వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిపై శ్వేతపత్రాన్ని ఎందుకు విడుదల చేసిందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. అసలు సర్కారు ఏం చెప్పాలనుకుంటోందని నిలదీశారు. రాజకీయ లబ్ది కోసం తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులేదని చెప్పి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోందని అక్బరుద్దిన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లకూడదన్నదే తన ఉద్దేశమన్న ఆయన.. కాగ్, లెక్కకు శ్వేతపత్రానికి చాలా తేడా ఉందని అన్నారు. రాష్ట్రం అప్పులు చేసింది నిజమేనని అలాగే పదేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కేంద్రం రూ. 44 లక్షల కోట్లు అప్పు తెస్తే ఎందుకు ప్రశ్నించరని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.