Home > తెలంగాణ > రేషన్‌ కేవైసీని ఆపేయండి.. కేంద్రానికి మంత్రి గంగుల విజ్ఞప్తి

రేషన్‌ కేవైసీని ఆపేయండి.. కేంద్రానికి మంత్రి గంగుల విజ్ఞప్తి

రేషన్‌ కేవైసీని ఆపేయండి.. కేంద్రానికి మంత్రి గంగుల విజ్ఞప్తి
X

రేషన్​ కార్డు ఈ– కేవైసీ కోసం రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్డులోని ఒక్కరు చేయించుకోకపోయినా బియ్యం రావని డీలర్లు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు పొందాలన్నా ఈ– కేవైసీ కంపల్సరీ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న క్రమంలో రేషన్‌ కార్డుల కేవైసీ ప్రక్రియపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ లేఖ రాశారు. రేషన్‌కార్డు లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవైసీ ప్రక్రియ వల్ల రాష్ట్రంలోని లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని పీయూష్‌గోయల్‌కు సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.

దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనా వైఫల్యాల వల్ల సరైన ఉఫాది లేక తెలంగాణకు చెందిన చాలామంది రేషన్‌ లబ్ధిదారులు బతుకుదెరువు కోసం విదేశాలకు, దూరప్రాంతాలకు వలస పోయారని, వీరంతా వచ్చి కేవైసీ చేయించుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కేవైసీని కచ్చితం చేయడం వల్ల వీరంతా నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. కేవైసీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. కేవైసీతో కలిగే ఇబ్బందులపై ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల ప్రయోజనాలను కచ్చితంగా కాపాడుతుందని భరోసా ఇచ్చారు.

ప్రస్తుత కేవైసీ నిబంధనల వల్ల దూరప్రాంతాల నుండి రాలేక ఇబ్బందులు పడుతున్నతెలంగాణ ప్రజానీకం ప్రయోజనాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుతుందని ఈ లేఖ ద్వారా భరోసానిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సైతం అదేరీతిలో ప్రజలకు భరోసా కల్పించాల్సిందిగా కోరుతూ ఆహార భధ్రతా కార్డుల కేవైసీ నిబందనలపై పున:సవిూక్షించాల్సిందిగా కోరుతున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు.

Updated : 26 Sept 2023 7:50 AM IST
Tags:    
Next Story
Share it
Top