కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలలకో సీఎం.. మంత్రి హరీశ్ రావు
X
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల అమలు కాదు ఆర్నెళ్లకో సీఎం మారడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు. హైదరాబాద్లో ప్రతి 6 నెలలకు ఒకసారి కర్ఫ్యూ వస్తుందన్నారు. ఎలాగూ అధికారంలోకి రామని తెలిసి ఏదైనా మాట్లాడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరును చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు మళ్లీ డిల్లీ హైకమాండ్ అవుతుందని... వయా రెండో రాజధాని బెంగళూరు మీదుగా డిల్లీ వెళ్లాల్సి వస్తుందని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ గ్యారంటీ హామీలు అమలయ్యేవి కావని... కేవలం ఎన్నికల కోసమే వీటిని ప్రకటించారని అన్నారు. ఈ గ్యారెంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటివని అన్నారు. బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి సూచించారు. త్వరలోనే బిఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుందని... ఇది ఎంతో అద్భుతంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ మాటిచ్చాడంటే చేసి చూపిస్తాడని... అందుకు నిదర్శనమే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణమని హరీష్ అన్నారు. నారాయణ్ ఖేడ్ కి ఏం కావాలో సీఎం కేసీఆర్ కు తెలుసు... అందులో భాగంగానే రూపాయి ఖర్చు లేకుండానే వంద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చారని అన్నారు. ఇవాళ వారు ఎంతో ఆనందంగా ఇళ్లల్లోకి వెళుతున్నారని అన్నారు. ఇప్పుడు చేస్తున్నట్లు రేపటికి కూడా సీఎం కేసీఆర్ చాలా చేస్తారన్నారు.
ఎన్నికల్లో ప్రజల ఓట్లకోసమే కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి బోగస్ మాటలు నమ్మి అగం కావద్దుని సూచించారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని విమర్శించారు. ఎంత సేపు కేసీఆర్ని తిట్టుడే తప్ప వాళ్లకు మరో పనిలేదన్నారు. వీరి తిట్లు పట్టించుకోకుండా కేసీఆర్ ప్రజలకు కిట్లు ఇస్తున్నారని అన్నారు. కాబట్టి కిట్లు ఇచ్చే వాళ్ళు కావాలో, తిట్టేవాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రజా నాయకుడు... కాబట్టి ఆయనను మరోసారి గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేను చేయాలని నారాయణఖేడ్ ప్రజలను కోరారు హరీష్ రావు.