రజినీకి అర్థమైంది..గజినీలకు కావడం లేదు..హరీశ్ రావు
X
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. పటాన్‌చెరు పరిధిలోని కొల్లూరులో మంత్రి హరీశ్ రావు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మినిస్టర్ కొల్లూరులో విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా గతంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీపై స్ట్రాంగ్ కౌంటర్స్ వేశారు. హైదరాబాద్ అభివృద్ధి హీరో రజినీకాంత్‌కు అర్థమైంది కానీ, గజినీలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ.." తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలను తీర్చారు. కానీ 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయి. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మంచినీటిని అందిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేది. రాష్ట్ర మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ కిట్లు మహిళలకు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప మరేమీ జరగలేదు. హైదరాబాద్ అభివృద్ధి గురించి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అర్థమైంది. కానీ మన దగ్గర ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలే ప్రచారం చేయాలి. ఎన్నికలు వస్తున్నాయి. రకరకాల హామీలతో, నినాదాలు చేస్తూ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తారు. ఎన్ని డిక్లరేషన్‌లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు బీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు" అని మంత్రి తెలిపారు.