Home > తెలంగాణ > రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు

రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు

రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు
X

ఖమ్మం జిల్లా పాల్వంచలో గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు మంత్రి హరీశ్‌ రావు. పాల్వంచలోని సుగుణ ఫంక్షన్‌ హాల్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన గిరిజన రైతులకు పోడు పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియా నాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 13,139 ఎకరాలు సాగుచేసుకుంటున్న 6,589 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 6 వేల ఎకరాలకు పట్టాలిస్తున్నామన్నారు. ధరణిలో ఆయా రైతుల పేర్లు నమోదైతే భూములకు యజమాని అయినట్టేనన్నారు. ఇకపై పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. అకాల వర్షాల వల్ల, వడగండ్ల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం తరపున ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తామని తెలిపారు.

పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల నేటితో సాకారం కానుంది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. కాసేపటి క్రితమే సీఎం సిద్దిపేటలోని అగ్రికల్చర్‌ ఫామ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. మధ్యాహ్నం రెండు గంటలకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు సీఎం హెలిక్యాప్టర్‌ చేరుకోనుంది. అనంతరం సీఎం.. కుమ్రంభీం చౌరస్తాకు చేరుకొని, కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించనున్నారు. అక్కడే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్ ను, జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగసభలో పాల్గొననున్నారు.

పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు.

Updated : 30 Jun 2023 8:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top