కాంగ్రెస్కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదు.. కానీ గ్యారెంటీ కార్డులట : హరీష్ రావు
X
కాంగ్రెస్ సభ ఆత్మవంచన, పరనిందగా సాగిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదని సెటైర్ వేశారు. నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు.. అధికారంలోకి వచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకుంటూ బూటకపు హామీలు ఇచ్చారని ఆరోపించారు. పైగా కాంగ్రెస్ చెప్పిన గ్యారెంటీలు సైతం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవేనని చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలని హరీష్ రావు అన్నారు. కర్నాటకలో ఇలాగే ఇచ్చి.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆగం ఆగం అవుతున్నారని చెప్పారు. అక్కడ మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇచ్చినట్టు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా అని అడిగారు. ఎన్నికలపుడు వచ్చుడు..నోటికి వచ్చింది చెప్పుడే తప్ప మీరు ఇచ్చే గ్యారెంటీలను అమలు చేసేది ఎవరని నిలదీశారు.
‘‘రాహుల్ గాంధీ మీ అజ్ఞానానికి జోహార్లు. రాష్ట్రపతి ఎన్నికల్లో మేం బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. మేం యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చాం. బాజాప్తా ఆయనకు మా పార్టీ ఓటేసింది. తెలంగాణాకు యశ్వంత్ సిన్హాను పిలిచి భారీ సభ పెట్టాం. మీ నేతలనే అడగండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మేము బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. జీఎస్టీ బిల్లును తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వడంలేదా..? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు..? ఎందుకీ నయవంచక ముచ్చట్లు’’ అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
అవినీతి గురించి మీరు మాట్లాడడమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరినట్టుందని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. స్కాంల సంస్కృతిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని.. అది కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్ అని ఆరోపించారు. బోఫోర్స్ నుంచి దాణా, చక్కర కుంభకోణాలు వంటివి ఎన్నో కాంగ్రెస్ చరిత్రలో ఉన్నాయన్నారు. దేశంలో అవినీతికి కేరాఫ్ అడ్రెస్సే కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే తోడేలు శాకాహారం గురించి మాట్లాడినట్టు ఉంటదని చురకలంటించారు.