ప్రజలు పండగ అనుకుంటే.. విపక్షాలు దండగ అనడం విడ్డూరం : హరీష్ రావు
X
సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు అడ్డగోలు వాగుడు వాగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టును ప్రజలు పండగలా భావిస్తే.. విపక్ష నేతలు దండగా అంటున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్ట్ దండగ కాదు ప్రతిపక్షాలు దండగా అని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ పాలమూరు ప్రజల కరువును తీర్చే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు. పాలమూరు ప్రజలపై విపక్ష నాయకులు పగ సాధిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమకు పనోళ్లు కావాలా.. పగోళ్లు కావాలా అని ఆలోచించాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్కి మధ్య పోటీ ఉంటుందని హరీష్ రావు చెప్పారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ను ప్రజలు కోరుకోరని అన్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను ప్రజలను నమ్మరని తెలిపారు. ఇంతకుముందు కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉండేది కానీ ఇప్పుడు బెంగళూరు అయ్యిందని మంత్రి సెటైర్ వేశారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలు ముందు ఛత్తీస్గడ్, కర్నాటక, రాజస్థాన్లో అమలు చేయాలని సవాల్ విసిరారు. ఆకలి అయితే నాడు అన్నం పెట్టలేదు.. కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తామంటున్నారని విమర్శించారు.
ఎంబీబీఎస్ ఫీజు 10వేలు..
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని హరీష్ రావు చెప్పారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
ఆటోడ్రైవర్ కొడుకు, హమాలీ కూలీ కూతురు ఎంబీబీఎస్ చదవటం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎల్కేజీ చదవే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని.. కానీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజు కేవలం 10 వేలు మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐటీ, ఫార్మా, విద్య, వైద్యం, పంట, పాడి ఏ రంగం చూసినా తెలంగాణ అగ్రస్థానంలో ముందుకు సాగుతోందన్నారు.
కేసీఆర్ గిఫ్ట్..
ప్రభుత్వంలో ఆర్టీసీని విలినాన్ని ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని హరీష్ రావు అన్నారు. ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇది కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. ఇకపై వారు ఆర్టీసీ కార్మికులు కాదని ప్రభుత్వ ఉద్యోగులు అని తెలిపారు. నాటి పాలకులు ఆర్టీసీని అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీకి పండుగ తీసుకొచ్చిందన్నారు.