మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి.. పార్టీ శ్రేణులతో హరీష్ రావు
X
బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ, వార్ రూం ఇంఛార్జులతో జలవిహార్లో ఆయన భేటీ అయిన ఆయన.. వారికి దిశానిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ మూడోసారి సీఎంగా అధికారం చేపడతారని సర్వేలు చెబుతున్నాయని హరీష్ రావు అన్నారు. నెల రోజులు సీరియస్ ప్లాన్ ప్రకారం కష్టపడి ముందుకెళ్తే పార్టీ గెలుపు సులువవుతుందని సూచించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనుకబడి ఉన్నామని దానిపై దృష్టి సారించాలని చెప్పారు. తండాలను పంచాయితీలుగా చేయడం, పోడు భూముల సమస్య పరిష్కారానికి చేస్తున్న కృషి, బీఆర్ఎస్ ప్రజా సంక్షేమ పథకాల గురించి జనాల్లో విస్తృత అవగాహన కల్పించాలని హరీష్ రావు సూచించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడంతో పాటు మేనిఫెస్టో గురించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని హరీష్ రావు విమర్శించారు. పార్టీ శ్రేణులు దాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజేయాలని అన్నారు.