వారం రోజుల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ : హరీష్ రావు
X
మరో వారం రోజుల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ అందిస్తామని హరీష్ రావు తెలిపారు. పుట్టబోయే బిడ్డకు న్యూట్రిషన్ కిట్.. పుట్టిన బిడ్డకు ఇచ్చేది కేసీఆర్ కిట్ అని అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం నీళ్లతో మండుటెండలలో చెరువులు నిండు కుండలుగా తలపిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత ఉండేది.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్, ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు.
మాల్యాల గ్రామానికి అందరి కృషితో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని హరీష్ రావు అన్నారు. గ్రామ రూపురేఖలే మారిపోయాయని.. గల్లిగల్లీలో సీసీరోడ్లు వేసుకున్నామని వివరించారు. ‘‘మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటా’’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా అంటూ గ్రామస్థులను ప్రశ్నించారు. రూ.200 పింఛన్ రూ.2 వేలు చేశామని పేర్కొన్నారు.
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మొదటి విడతలో 40-50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ లైబ్రరీకి వారంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానని హామీనిచ్చారు. గ్రామంలో 808 రైతులకు రైతుబంధు, అనివార్య కారణాలతో మృతి చెందిన 14 మంది రైతు కుటుంబాలకు రైతుభీమా ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. గ్రామంలో ఇటీవల శిక్షణ పొందిన 21 మందికి కుట్టు మిషన్లు త్వరలోనే అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.