కేసీఆర్ వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి.. బాబు అరెస్ట్‌పై హరీశ్ రావు
X
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అటు ఐటీ రంగంలోనూ ఇటు వ్యవసాయం రంగంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఆయన సిద్దిపేటలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అరెస్టు అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ హయాంలోనే ఐటీ పరిశ్రమ మూడు రెట్లు అభివృద్ధి చెందిందన్నారు.
‘రాష్ట్రం అన్ని రంగాలలో ముందుంది.. పాపం చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు. ఈ సమయంలో ఆయన గురించి మాట్లాడకూడదు. అయితే ఆయన గతంలో ఐటీ ఐటీ అనేవారు. నిజానికి కేసీఆర్ వచ్చాకే ఐటీ పరిశ్రమ అభివృద్ధి అయింది. హైదరాబాద్‌లో ఐటీ, పల్లెల్లో వ్యవసాయం పుంజుకుంన్నాయి. అంతకుముందు 3.5 లక్షలు ఉన్న ఐటీ ఉద్యోగాలు కేసీఆర్ వచ్చాక 10 లక్షలకు చేరాయి. ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో, వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉంది ’’ అని మంత్రి అన్నారు.