మాట తప్పిన కాంగ్రెస్ కావాలా.. నిలబెట్టుకునే కేసీఆర్ కావాలా - హరీశ్ రావు
X
రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి కేసీఆర్ రాకముందు.. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆలోచన చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఆనాడు తాగునీటి కోసం ఎంత కష్టపడ్డారో గుర్తుచేసుకోవాలని అన్నారు. అప్పుడు తండాలు మంచం పట్టాయని, విష జ్వరాలతో గిరిజన గూడేలని పేపర్లలో హెడ్డింగులు వచ్చేవని కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. మిషన్ భగీరథతో తండాల్లో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నామని చెప్పారు.
2009లో తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని హరీశ్ మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ చేసి చూపించిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4.50లక్షల ఎకరాల పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు ఇచ్చారని.. ఆ భూములకు రైతుబంధు కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవాలన్న సంకల్పంతో గిరిజన గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో గిరిజన ఆదివాసీ బిడ్డల కోసం బంజారా, ఆదివాసీ భవనాలను కట్టించామని, విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. గిరిజన గూడేలు, తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని, కేసీఆర్ మళ్లీ గెలిస్తే గిరిజన బంధు ఇస్తారని హామీ ఇచ్చారు. మాట తప్పిన కాంగ్రెస్ ఒకవైపు ఉంటే.. మాట తప్పని కేసీఆర్ ఇంకోవైపు ఉన్నారని, సేవాలాల్, కొమురం భీం వారసులంతా సరైన నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.minister harish rao participated in girijana atmeeya sammelanam at shamirpet